మానవుడు జన్మతః పాపియా?
నేడు అధిక శాతం బోధకులచే ప్రచారం కాబడుతున్న జన్మతః పాప సిద్ధాంతం ఏమిటంటే- "ఆది మానవుడైన ఆదాము, హవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమణ పాపంగా మారి, అది సమస్త మానవులకూ జన్మతః సంక్రమిస్తూ వస్తుంది! దాని కారణంగా మానవులందరూ పాపంలోనే పుడుతూ, పాప స్వభావులైపోయారు. దానికి పరిష్కారంగా పాతనిబంధనలో జంతు బలుల ద్వారా ఎంతో రక్తం చిందించబడినప్పటికీ మానవుల ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ పథకంలో విఫలమైన దేవుడు లోక పాపులు నరకంలో కాలిపోవటం ఇష్టం లేక తానే యేసులా ఈ లోకంలో అవతరించి (కొందరి ప్రకారం తన స్వంత కుమారుడైన యేసును పంపి) సిలువ పై రక్తం చిందించి, జన్మతః పాపం నుండి సకల పాపాల నుండి విముక్తి కలిగించాడు" అన్నది.
జన్మతః సంక్రమిత పాప సిద్ధాంతం హేతుబద్ధమైనదేనా?
నేడు ప్రపంచంలో ఇంకా కళ్ళు సైతం తెరువని అనేకమంది పసి పిల్లలు అనేక కారణాలవల్ల చనిపోతున్నారు. కొందరైతే గర్భంలోనే చనిపోతున్నారు. అలాంటి పసిప్రాయంలో లోకంసైతం తెలియని పిల్లలు, కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఆదాము చేసిన పాపంతో ఏ మాత్రం సంబంధం లేనప్పటికీ అప్పుడెప్పుడో ఆదాము చేసిన పాపమును బట్టి వారు జన్మతః సంక్రమిత పాపులుగా చనిపోతున్నారు కాబట్టి వారందరూ నిత్య నరకాగ్నికి బలికానున్నారు! అని తీర్మానిస్తే అంతకంటే హేతువిరుద్ధమైన మూఢ విశ్వాసం మరొకటి ఈ లోకంలో ఉంటుందా? పరమ న్యాయవంతుడైన దేవుడు అటువంటి అన్యాయపు తీర్మానం చేస్తాడని ఏ విశ్వాసి అయినా చెప్పగలడా? చివరకు ఈ సిద్ధాంతం ప్రచారం చేసే వారి ఇంట్లోనే దురదృష్ట వశాత్తు వారికి పుట్టిన పసి పిల్లాడే చనిపోతే ఆ పిల్లాడు జన్మతః పాపంలో పుట్టాడు గనుక నరకంలో వెళ్లిపోతాడని తీర్మానించగలరా? తమ స్వంత పిల్లల విషయంలోనే అలా తీర్మానించలేని వారు పుట్టే ప్రతీ మానవుడూ జన్మతః పాపంలోనే పుట్టి, చనిపోతున్నాడు అని ప్రచారం చెయ్యటం ఎంతవరకు న్యాయం? ఇక చిన్న పిల్లల విషయంలో నాడు యేసు చేస్తున్న తీర్మానం ఏమిటో ఈ క్రింది గమనించగలరు.
యేసుచిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి వారిమీద చేతులుంచి, అక్కడనుంచి లేచిపోయెను. - మత్తయి 19:14
పరలోక రాజ్యం పసి పిల్లలదని పై వాక్యంలో యేసు చెప్పటాన్ని బట్టి మనిషి జన్మతః పాపిగానే పుడతాడని యేసు ఏనాడూ భావించలేదని తేటతెల్లమౌతుంది. అలాగే మరో చోట
"మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు" (మత్తయి 18:3) అని యేసు చెబుతున్నారు. నిజంగా ప్రతీ మానవుడూ జన్మతః పాపంలోనే పుడుతున్నాడు అన్నదే నిజమైతే యేసు పై వాక్యంలో పాపులవలే మారామంటున్నారని అర్థమా? ముఖ్యంగా ఒకరు చేసుకున్నా పాపానికి మరొకరు ఎంతమాత్రం బాధ్యులు కారని యేసు చెబుతున్నా ఈ క్రింది వాక్యం అత్యంత గమనార్హం.
ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. - యోహాను 9:1-3
ఈ విధంగా చెప్పి యేసు ఒకరి పాపానికి మరొకరు బాధ్యులన్న మూఢ విశ్వాసాన్ని ఖండించారు. అంతే కాదు...
మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు. - లూకా 5:32
అని యేసు ఒక చోట చెబుతున్నారు. నిజంగా ఆదాము చేసిన పాపం అందరికీ సంక్రమించి అందరూ పాపులైపోతే "పాపులు-నీతిమంతులు" అన్న భేదాన్ని యేసు చూపగలిగేవారా? దీనిని బట్టి ఆదాము చేసిన పాపానికి మానవులంతా పాపులైపోయారన్న సిద్ధాంతాన్ని యేసు ఆనాడే ఖండించారని తెలుసుకున్నాం.
జన్మతః పాపం యేసుకు సంక్రమించదా?
పుట్టే ప్రతీ మనిషీ పాపంలోనే పుడుతున్నాడు కనుక మానవాళి పాప పరిహారార్ధం పరిశుద్ధ రక్తం అవసరం కాబట్టి జన్మతః పాపం అంటకుండా దేవుడు, యేసును తండ్రి లేకుండా పుట్టించాదన్నది నేటి అధికశాతం బోధకుల ప్రచారం! ఈ వాదన వాక్యానుసారమైనది మరియు హేతుబద్ధమైనదే అనుకుంటే యేసుకు భౌతిక తండ్రి అయితే లేరు, కానీ భౌతికంగా తల్లి అయితే ఉంది కదా!? పైగా ఆదిలో ఆజ్ఞాతిక్రమణ హవ్వ ముందు చేశాకే కదా ఆదాము కూడా పాల్పడింది? కాబట్టి ఆదిలో జరిగిన ఆజ్ఞాతిక్రమణ పాపం అందరికీ సంక్రమిస్తుందన్నది నిజమే అయితే క్రైస్తవ బోధకుల ప్రకారం పాప జనని అయిన హవ్వ చేసిన పాపము సహజంగానే కన్య మేరీకీ కూడా సంక్రమిస్తుంది!! ఆ విధంగా చూసినా కన్యామేరీ పాపపు రక్త-మాంసాలు పంచుకుని పుట్టిన యేసుకు జన్మతః పాపం అంటదా? పైగా స్వయంగా యేసు
"నేను దావీదు వేరు చిగురును (ROOT) మరియు సంతానమును" (ప్రకటన 3:14) అని ప్రకటించుకుంటున్నారు? తప్పితే నేను దేవుని వేరుచిగురును సంతానమును అని అనటంలేదు. దీనిని బట్టి నేడు ప్రకటించబడుతున్న సంక్రమిత పాపసిద్ధాంతం నిజమే అయితే ఆదాము పాప సంతతిలో పుట్టిన దావీదు సంక్రమిత "పాపపు వేరు" పంచుకుని పుట్టిన యేసుకు సైతం జన్మతః పాపం సహజంగానే సంక్రమించి తీరుతుంది. అప్పుడు యేసును సైతం జన్మతః పాపి అని తీర్మానించాల్సి ఉంటుంది. దీనిని బట్టి జన్మతః సక్రమిత పాప సిద్ధాంతం వాక్య విరుద్ధమైనదే కాక ఎంత హేతు విరుద్ధమైనదో తెలుస్తుంది.
జన్మతః సంక్రమిత పాప సిద్ధాంతం బైబిల్ బోధా? అన్య బోధా?
"టెర్టూలియన్ అనే అలెగ్జాండ్రియన్ వేదాంతి మొట్టమొదటి సారిగా మానవుడు పుట్టుకతోనే పాపి అయి ఉన్నాడు! కనుక అతనికి పుట్టుకతోనే బాప్టిస్మం ఇవ్వాలన్న విశ్వాసాన్ని ప్రతిపాదించి, జన్మతః పాపం అనే పదానికి ఉనికి కలిగించాడు. అతని బోధలకు ప్రేరేపితుడైన సుప్రియన్ అనే బిషప్పు సైతం ఆదాము పాల్పడిన పాపం అందరికీ సంక్రమితంగా వస్తున్న ఒక అంటూ వ్యాధి లాంటిదిగా అభివర్ణించి, ఆ పాపం మనుష్యుల శారీరక కలయిక ద్వారా అందరికీ సంక్రమిస్తుందని చెప్పాడు."
-Ref: Tatha Wiley, Original Sin - Developments Contemporary meanings. Page No. 46-49
దీనిని బట్టి మానవుడు జన్మతః పాపి అన్న దృక్పథం బైబిల్ బోధ కాదు! కానీ కొందరి ద్వారా ఉనికి లోనికి తీసుకు రాబడిన కల్పిత అన్య సిద్ధాంతమని తేటతెల్లమైంది.
బైబిల్ ప్రకటన - ఎవరి పాపానికీ వారే బాధ్యులు!
కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవనిపాపము నిమిత్తమువాడే మరణశిక్ష నొందును. - ద్వితీ 24:16
ప్రతి వాడు తన దోషముచేతనే మృతినొందును; ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్లే పులియును. - యిర్మీయ 31:30
పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. - యెహెజ్కెలు 18:20
పై లేఖనాలే కాక, ఇంకా అనేక లేఖనాల ద్వారా ఒకరు చేసిన పాపాలను మరొకరు ఎంత మాత్రం మోయరని, ఎవరు చేసిన పాపానికి వారే బాద్యత వహించాల్సి ఉంటుందన్న యదార్థం గమనించగలం. వాస్తవం ఇడైనప్పుడు ఆదాము పొరపాటుగా చేసిన మొదటి పాపము సకల మానవాలికీ జన్మతః సక్రమించి అందరూ పాపులైపోయారు కనుక దానికి పరిష్కారం యేసు రక్తంలో కడగబడటం ఒక్కటే! అని ప్రచారం చెయ్యటం వాక్య విరుద్ధమని తెలియటం లేదా?
పౌలు ప్రకారం మన పాపాల బరువు యేసు మోస్తున్నారా? లేక ఎవరి పాపాల బరువు వారే మోసుకోవాల్సి వస్తుందా?
నేటి అధిక శాతం బోధకుల ప్రకారం- పుట్టే ప్రతీ మనిషీ పాపంలోనే పుడుతున్నాడు. కనుక సకల మానవుల పాపాల బరువును తనమీద వేసుకోవటానికే యేసు ఈ లోకానికి వచ్చారన్నది! అదే వాస్తవమైతే ఈ క్రింది వాక్యాలలో పౌలు చెబుతున్నది ఏమిటో గమనించగలరు.
ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.
ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా? - గలతీ 6:4,5
ప్రతీ వాడునూ తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. - 1 కోరింధీ 3:8
పై వాక్యాలలో పౌలు బహిర్గత పరుస్తున్న గమనార్హమైన విషయం ఏమిటంటే- "ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను" అన్నది. అంటే ప్రతీ వ్యక్తీ తాను చేసుకునే పాపాల బరువు తానే భరించుకోవాల్సి ఉంటుందన్నది. అంటే ప్రతీ వ్యక్తీ తాను చేసుకునే పాపాల బరువు తానే మోయాల్సి ఉంటుంది తప్ప నేటి కొందరు బోధకులు చెబుతునట్టు మానందరి పాపాల బరువును యేసు తన మీద వేసుకు పోతారని పౌలు బోధ ఎంత మాత్రంకాదు! ఈ సందర్భంలో పౌలు చెబుతున్న మరొక అత్యంత గమనార్హమైన ఈ క్రింది వాక్యాన్ని గమనించగలరు.
మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. - రోమా 14:12
పై వాక్యాన్ని బట్టి ఆదాము చేసిన పాపానికి మనమూ బాధ్యులము కాము, మనం చేసుకునే పాపాలకు యేసు కూడా బాధ్యులు కారు! కానీ ఎవరు చేసుకునే పాపాలకు వారే బాధ్యత వహించి, దేవునికి లెక్క అప్పగించాల్సి ఉంటుందని తేటతెల్లమౌతుంది. ఒకరి పాపాల బరువు మరొకరు మోసేదే ఉంటే మనలో ప్రతీ వాడూ దేవునికి లెక్క అప్పగించాల్సి ఉంటుందని పౌలు ఎందుకు చెబుతాడు?
సకల పాపుల పాపాల బరువును యేసు తనమీద వేసుకొనున్నారా?
నేటి అధిక శాతం బోధకుల ప్రచారం ఏమిటంటే- సకల మానవాళి పాపాలను తనమీద వేసుకుని, వారి పాపాలకు పరిహారంగా సిలువపై తన రక్తం చిందించి, వారందరినీ నిత్యాగ్ని నుండి రక్షించుకుంటారన్నది! ఈ ప్రచారమే నేటి ప్రధాన క్రైస్తవ సంపన్న దేశాలలో "చెడు" పట్ల ఏహ్యా భావాన్ని నశింపచేయటంలో ప్రధానపాత్ర వహిస్తుంది. దానికి గొప్ప ఆధారం- నేటి ప్రధాన క్రైస్తవ దేశాలే హత్యలు, వ్యభిచారము, స్వలింగ సంపర్కం వంటి బైబిల్ నిషేధించిన ఘోర పాపాలను చేయటంలో అగ్రస్థానం (Top ten) లో నమోదుకాబడుతున్నాయని నేరపరిశోధనా గణాంకాలు తెలుపుతున్నాయి. కానీ యేసు చెబుతున్నదేమిటంటే ఎవరి పాపాల విషయంలో వారే వ్యక్తిగత బాధ్యత కలిగి, తమ ద్వారా జరుగబోయే పాపాల విషయంలో శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నది.
నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికివేయుము; నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగ హీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుటమేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులు కలిగి నరకములో పడవేయ బడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు. - మార్కు 9:43-48
పాపులకు యేసు చేస్తున్న తీవ్రమైన హెచ్చరికే పై వాక్యం. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే- యేసు సకల మానవాళి పాపాల బరువును తన నెత్తి మీద వేసుకోవటానికే వచ్చారన్నది వాస్తవమైతే "మనుషులు పాపం చేయటానికి శరీరంలో ఏ అవయవాలైతే అభ్యంతరపరుస్తున్నాయో ఆ అవయవాలను రక్తంలో కడిగేసుకుంటే చాలు" అని చెప్పక పాపం చేసిన అవయవాలతో నరకంలో వెళ్ళటం కంటే వాటిని తొలగించేసుకోమని ఎందుకు ఆజ్ఞాపిస్తారు? దీనిని బట్టి పాపులు తమ పాపాల విషయంలో వ్యక్తిగతమైన అదుపును కలిగి, తమ పాపాలకు తగిన శిక్షను అనుభవించటమే తప్ప రక్తం పాపులకు ఏ పాపానికీ పాల్పడకుండా నియంత్రించే శక్తి కలిగి లేదు సరికదా, మనిషి తాను చేసుకునే "మంచి-చెడు" క్రియలను బట్టే పరలోకంలో "శిక్షా-బహుమానాలు" పొందనున్నాడన్నది దేవుని ఆది ప్రణాళిక అయి ఉన్నదని బైబిల్ ప్రకటిస్తుంది. "నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫల మిచ్చును" (యోబు 34:11)
అంతే కాక స్వయంగా యేసు-
"నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలనుబట్టి నీతి మంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అప రాధివని తీర్పునొందుదువు" -మత్తయి 12:36,37
అని చెబుతున్నారు. తప్పితే మీరు ఎన్ని పాపాలు చేసుకున్నా పరవాలేదు వాటి బరువును నామీద వేసుకుంటాను మీరు నిశ్చింతగా ఉండవచ్చు" అని చెప్పటం లేదు.
వాస్తవానికి మనిషి తాను చేసిన పనుల "లెక్క" చెప్పవలసి ఉన్నప్పుడు అతను చేసుకునే "మంచి" పనులకు "బహుమానం" అతను చేసుకునే "చెడు" పనులకు "శిక్ష" ఇవ్వబడుతుందన్న తీర్పు సైతం ఉంటుందనటంలో సందేహమే ఉండదు. ఇక పౌలు అయితే ఎంతో స్పష్టంగా-
దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును. సత్ క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధాన మును కలుగును" -రోమా 2:9,10
అని హెచ్చరిస్తున్నాడు. దీని బట్టి పరలోకంలో మనుషులు చేసుకునే "మంచి-చెడు" క్రియలను బట్టే "శిక్షా-బహుమానాలు" ఇవ్వబడతాయి తప్ప, ఒకరి పాపాల బరువును యేసో లేక మరొకరో తమ మీద వేసుకోరని, ఎవరి పాపాల బాధ్యత వారిదేనని తేటతెల్లమైంది.
వాస్తవానికి పాపం, పుణ్యం అనేవి ఒకరి ద్వారా మరొకరికి జన్యు పరంగా జన్మతః సంక్రమించేవి కావు. అయితే ఆదాము చేసిన పాపమును "పోలి" ఎవరైనా ఆజ్ఞాతిక్రమణ చేస్తే ఆ పాపము అతనికి "కర్మతః" వస్తుంది చెప్పవచ్చు. తప్పితే ఆదాము పొరపాటుగా ఆదిలో చేసిన పాపము జన్యుపరంగా పుట్టే ప్రతి వ్యక్తికీ సంక్రమిస్తుంది అనటం వాక్య విరుద్ధం అవుతుంది. కనుక ఇప్పటివరకు సాగిన వాక్య పరిశీలన ద్వారా ఆదాము చేసిన పాపమో లేక ఎవరో చేసిన పాపము వారి సంతానానికి జన్మతః సంక్రమించదు కాబట్టి "మానవుడు జన్మతః పాపి కాడు" అన్న గొప్ప సత్యం మనకు బయల్పడింది. మరింత సమాచారం కొరకు "పాప పరిహారానికి రక్తం అవసరమా?" "రక్షణకు ఏకైక మార్గం యేసు రక్తమా?" "సిలువ బలియాగామా కుట్ర?" పుస్తకాలను ఈ web site ద్వారానే ఉచితంగా Download చేసుకుని చదువగలరు. ఈ సత్యాలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఆ సృష్టికర్త అయిన దేవుడు మనందరికీ ప్రసాదించు గాక. - ఆమెన్